అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కత్తి కాంతారావు'. ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు. బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, ఈదర రవికుమార్, ఈడ్పుగంటి సుబ్రహ్మణ్యేశ్వరరావు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించారు. అంబికా కృష్ణ, కె.ఎల్.నారాయణ అందుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ "హీరోలు, నిర్మాతల కొడుకులే కాదు.. దర్శకుల వారసులు కూడా హీరోలుగా నిలబడుతారని నరేష్ నిరూపించాడు. ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ మాలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించే దర్శకుడు ఈవీవీ. వీరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా విజయవంతం కావాలి'' అని అన్నారు.
ఈవీవీ మాట్లాడుతూ "ఆద్యంతం నవ్వులు పండించే సినిమా ఇది. 'ఆ ఒక్కటి అడక్కు', 'అప్పుల అప్పారావు' తరహాలో ఈ సినిమా కూడా వినోదాత్మకంగా ఉంటుంది. మలి సగంలో కోట పాత్ర అద్భుతంగా ఉంటుంది. కథాగమనానికి ఎంతగానో దోహదపడుతుంది'' అని అన్నారు. "మల్లికార్జున్ అందించిన బాణీలు అలరిస్తాయి. ఈవీవీ, నరేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నవ్వుల విందు అవుతుంద''ని నిర్మాతలు చెప్పారు.
నరేష్ నటించిన 36 సినిమాలను చూశానని తరుణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్, కోట శ్రీనివాసరావు, నాని, తనీష్, కృష్ణభగవాన్, నిఖిల్, శర్వానంద్, ఆర్పీ పట్నాయక్, జీవా, కొండవలస, ఎల్బీ శ్రీరామ్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌వీవీ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
No comments:
Post a Comment